Monday, September 6, 2021

 Here is a small attempt made by me in translating into Telugu from English version of "Life Skills" defined by World Health Organization, and, prescribed by CBSE for Class IX & X.  This assignment is carried out at the instance of Shri Akella Lakshmana Mohan garu, a great Mentor.


---------------------------------------------------------------------------------


జీవిత నైపుణ్యాలు (Life Skills)


యవ్వనం అనేది బాల్యం నుంచి యుక్త వయస్సుకుమళ్లే పరిణామ క్రమాన్ని సూచించే ఒక ముఖ్యమైన ఎదుగుదల మరియు అభివృద్ధి దశ.  మానసిక పరిణతి, సామాజిక పరిణతి లో మార్పులు త్వరితగతిన  చోటుచేసుకోవడం మనం గమనిస్తాం.  కుర్రకారు ఈ యుక్తవయస్సులోనే తమ సంబంధ బాంధవ్యాలను తల్లిదండ్రులతో, కుటుంబసభ్యులతో మాత్రమే కాక ఇతర వ్యక్తులతోనూ విస్తరింపజేసుకుంటారు. దీనివల్ల వారు మొట్టమొదటగా బాహ్య ప్రపంచంతో పరిచయం ఏర్పడటం మూలాన  తోటివారి ప్రభావం సాధారణంగా వారిపై గాఢంగా ఉంటుంది.  యుక్తవయస్సులో వీరు తీవ్ర మానసిక ఘర్షణలకు లోనవడం సహజం. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం అలవడటం అప్పుడప్పుడే ఏర్పడుతూ ఉంటుంది.  ఇక్కడే  వారు వివేచన మరియు విశ్లేషణాత్మక ధోరణికి అలవాటు పడేలా తయారుకావాలి. ఇదే సరైన సమయం.   ఈ వయస్సులో తమ భావాలను తగిన రీతిలో స్వేచ్ఛగా తమదైన శైలిలో ప్రకటించే పరిస్థితులకు వస్తారు. ఈ సమయంలో వారికి సృజనాత్మకత, ఆదర్శవంతంగా జీవించాలనే  వాదం, ఉల్లాసవంతమైన జీవనం, సాహసకృత్యాలకు పాల్పడటం వంటివి చేస్తారు.  ప్రయోగాత్మక ధోరణులకు పాల్పడటం, ప్రమాదాలను కొనితెచ్చుకోవడం, అతిముఖ్యమైన విషయాలపై చెప్పాపెట్టకుండా నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం చూస్తూఉంటాం. ముఖ్యంగా శారీరకంగా, లైంగికపరంగా వచే మార్పులుపై చర్చించదానికి ఇష్టపడరు. ఆవిధంగా యవ్వనం కుర్రకారు జీవితంలో ఒక కీలక ఘట్టం. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, వారి జీవితం రక్షణకవచంలేని సైనికుడిలా అనేక ఆటుపోట్లకు గురికాక తప్పదు.  


నేనెవరు?


ఆత్మపరిశీలన అనేది యువత తనకు తానుగా, తాను ఎవరనేది స్పష్టం చేస్తుంది.  వ్యక్తిగత గుర్తింపుకు ఇది దోహదపడుతుంది. నేను ఎవరు, నా బలాబలాలు, నా బలహీనతలు, నా ఇష్టాఇష్టాలు, నా శక్తియుక్తులను గూర్చి విచారించిన మీదట తనకు తానుగా ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిశీలన ప్రతీ ఒక్కరి జీవితంలోనూ / వృత్తులలొనూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎంతో అవసరం.   ఆత్మపరిశీలన లేదా వ్యక్తిత్వ గుర్తింపును పొందలేకపోవడానికి ముఖ్యకారణం, సమాచారలోపం మరియు  సరైన నైపుణ్యం లోపించడమే. దీని కారణంగా యువత వృత్తుల్లో రాణించలేక, ఒక అనుకూల ధృక్పథం ఏర్పరచుకోలేకపోతున్నారు.  ఉదాహరణకు, ఒక విద్యార్థికి చరిత్రలో అత్యంత శ్రద్ధ, ఆశక్తి ఉన్నాయనుకుందాం. కానీ తోటి విద్యార్ద్ధులు మరియు ఇతర కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు అతను మెడిసిన్ లో చేరితే అతను ఏ రకంగా ఆ వృత్తిలో రాణించగలడు? 

అందుకే యువత ముందుగా తనని తాను తెలుసుకొని అతని/ఆమె శ్రద్ధ, ఆశక్తి, శక్తియుక్తుల ప్రకారం కెరీర్ ను మలచుకొంటే ఎంత ఎత్తుకైన అతను / ఆమె ఎంచుకొన్న రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది.


ఉద్వేగాల అదుపు:


కౌమార దశలో ఉన్నవారు ( 10-19 సం" లోపు) ఎక్కువగా భావోద్వేగాలకు  లోనవుతూ ఉంటారు. ఇది వారియొక్క కోపం, బాధ, సంతోషం, భయం, సిగ్గు, తప్పుచేసామనే ఆలోచన, ప్రేమ తదితరమైన భావాలను  ప్రతిఫలిస్తూ ఉంటుంది. చాలా తరచుగా వారు ఉద్వేగపూరితమైన, ఆవేశపూరితమైన  భావాలను  అర్థంచేసుకోలేక సందిగ్థంలో పడటం జరుగుతుంటుంది. ఇతరులతో మనసువిప్పి మాట్లాడగలిగే  అనుకూల వాతావరణం వారికి లభించదు. సలహా తీసుకొనే వెసులుబాటు/ఆలోచన కూడా ఉండదు.  తనమీద తనకు నమ్మకం లేనప్పుడు విసుగు, ఆందోళనకు గురవడం జరుగుతుంది.  కనుక మన శక్తియుక్తులపై మనకు ఖచ్చితంగా నమ్మకముండాలి.  సమస్యకు పరిష్కారాలు ఆలోచించాలేగానీ, అయిపోయిన దానిగురించి  అనవసర ఉద్వేగాలకు  లోనవడం అర్థరహితం.


సంబంధాలు పెంపొందించుకోవడం:


వయస్సు వస్తున్న దశలో (కౌమార) వీరు తమ తల్లిదండ్రులతోనూ, తోటివారితోనూ, అబ్బాయిలు అమ్మాయిలతోనూ, అమ్మాయిలు అబ్బాయిలతోనూ తమ సంబంధాలను తిరగరాస్తారు.  పెద్దలు, వయోజనులు ( 18-35 సం"లోపు) వీరినుంచి అతిగా ఆశించడం, వీరి 

భావాలను అర్థం చేసుకోకపోవడం పరిపాటి.   పెద్దలు వీరి భావాలను అర్థం చేసుకొని విడమర్చి ఏది మంచి ఏది చెడు అనేది సోదాహరణంగా చెప్పాలి. కౌమారదశలో ఉన్నవారు తమతోటి వారితోనూ, లింగభేదం (అమ్మాయి-అబ్బాయి) ఉన్నవారితోనూ, సుహృద్భావ మరియు ఆరోగ్యకరమైన సంబంధాలు పెంచుకోవడంకోసం, సామాజిక  నైపుణ్యం కల్గిఉండటం ఎంతైనా అవసరం.


తోటివారి ఒత్తిడి:


కౌమారులు తోటివారి ఒత్తిడిని  అట్టే భరించలేరు.  కొంతమంది ఒత్తిడికిలోనై లొంగిపొవడం మరియు ప్రయోగాత్మక ధోరణులకు పాల్పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్టివారు శృంగార  కార్యకలాపాలవైపు  మొగ్గుచూపడం, పొగత్రాగడం, మత్తుమందులను కొద్దికొద్దిగా సేవించడానికి  అలవాటుపడ్డం, తరువాత దాని నుండి బయటపడలేక దానికి బానిసలయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. మనస్సు దేనిపైనైనా దుర్భుద్ధితో ఆకర్షణకు గురైనప్పుడు, దానివల్ల ఏర్పడే పర్యవసానలపై దృష్టిపెట్టగలిగితే వీటిపై మోహానికి గురికారు.


సమాచారం, విద్య, సేవలుకు సంబంధించిన విషయాల లభ్యత:


అంతర్జాలం (ఇంటర్నెట్), స్మార్టుఫోన్ల వినియోగంతో వీరు ఎనలేని సమాచారం బహిర్గతంగా పొందగల్గుతున్నారు. చాలామటుకు వీరు ఈ సమాచారాన్ని ఆకళింపు చేసుకోలేక సందిగ్ధావస్థలో పడుతున్నారు.  ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలను గ్రహించలేకపోతున్నారు.  తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, వివిధ కారణాల రీత్యా, ఎడం పెరుగుతూ ఉండటం కూడా ఇక్కడ మనం గమనిస్తే దీని ప్రభావం వారిపై చాలా ఉంటోంది.  ఉపాధ్యాయులు కూడా విద్యార్ధులతో సున్నితమైన విషయాలను మనసువిప్పి మట్లాడటానికి  సంకోచిస్తున్నారు. వివరణాత్మకమైన విశ్లేషణ లేకపోవడంవల్ల సందేహాలు సందేహాలుగానే ఉండిపోతున్నాయి. దీనివల్ల కౌమారులు ప్రయోగాలకు పాల్పడుతున్నారు.  వయస్సులో పెద్దవారు కౌమారులతో వారి జీవితాల్లో రాబోయే చిన్న పెద్ద విషయాలను ముందుగానే ఊహించి వారికి అర్థమయ్యే రీతిలో బోధపరచాలి.  అప్పుడు  వారు నిజంగా అటువంటి పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు, వాటిని ఎలా ఎదుర్కోవాలో సంసిద్ధులై ఉంటారు.  కౌమారులు సందేహనివృత్తి కోసం తమ తోటివారిపై ఆధారపడుతున్నారు.  వారు మిడిమిడిజ్ఞానంతో వారికి తోచిన రీతిన సమాచారాన్ని చెప్పడం, తెలిసీతెలియని వివరణ ఇవ్వడం, అదే నిజమని భ్రమల్లో వీరు మునిగిపోవడం సర్వసాధారణం. కౌమారులు వాడే ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లపై ఓ కన్నేసి, అవసరమైతే నియంత్రణా చర్యలు చేపట్టాలి. 


రాజీపడే పరిస్థితులు:


శృంగారపరంగా చురుగ్గా తొందరపడి వ్యవహరించేవారిలో ఎక్కువగా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.  అతిచిన్నవయస్సులో శృంగారంలో పాల్గొనడంవల్ల అమ్మాయిల్లొ ఉద్వేగపూరితమైన సమస్యలు, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముంది. సామాజిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, మత్తుమందులు, మాదక  ద్రవ్యాలకు అలవాటుపడటం వలన, హింసాత్మక ధోరణులవైపు ప్రేరేపితులవుతారు.


జీవిత నైపుణ్యాలు - జీవన నైపుణ్యాలు:


"వ్యక్తులకు నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను, అనుకూల మరియు సానుకూల దృక్పథంతో అతి సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యలే జీవన నైపుణ్యాలు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది.  అనుకూల దృక్పథం అంటే, ఒక వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒదిగిపోయే తత్వం కలిగి ఉండటం.  సానుకూల దృక్పథం అంటే ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముందుచూపు కలిగిఉండటం, ఆశారేఖలను చూడగల్గడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం, సమస్యలకు పరిష్కారం కనుగొనగలగడం.  జీవన నైపుణ్యాలు లేదా వృత్తి నైపుణ్యాలు అనేవి వ్యక్తి తన వ్యక్తిగత అవసరాలకోసం, గృహావసరాల నిమిత్తం వినియోగించే శక్తిసామర్థ్యాలు.  ఆ రకంగా, జీవన నైపుణ్యాలకి, జీవిత నైపుణ్యాలకి మధ్య వ్యతాసం ఉంది. 


ముఖ్యమైన జీవిత నైపుణ్యాలు : 


జీవిత నైపుణ్యం అనేది మనస్తత్వ, సామాజిక మరియు వ్యక్తుల మధ్య నేర్పుతో సంభాషించగల చాతుర్యం. ఇది తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ, సమస్యలు పరిష్కరించడంలోనూ, క్లిష్టమైన, వినూత్న రీతిన ఆలోచనా విధానాన్ని అవలంబించేందుకు, సమర్థవంతమైన సంభాషణలను కొనసాగించేందుకు, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించుకొనేందుకు, ఇతరులతో తాదాత్మ్యతతో మెలగేందుకు, మరియు వారియొక్క జీవితాలని చక్కదిద్దుకొనేందుకు ఉపయోగపడతాయి.  ప్రధానంగా ఇక్కడ రెండు నైపుణ్యాలను ప్రస్తావించుకోవచ్చు.  ఒకటి "ఆలోచనా సామర్థ్యం", రెండవది "సామాజిక నైపుణ్యం".   ఆలోచనా నైపుణ్యం వ్యక్తిగత విషయాలని ప్రతిబింబిస్తే, సామాజిక  నైపుణ్యం వ్యక్తుల మధ్య లౌక్య సంభాషణని తెలియజేస్తుంది.  ఇందులో తార్కిక ఆలోచనకు వీలులేదు.


ఈ రెంటి నైపుణ్యాల కలయిక వలన వ్యక్తులు దృఢమైన ప్రవర్తన కలిగి, ఇతరులతో ఇట్టే సంధి ఒడంబడికలను చేయగల్గుతారు.  భావోద్వేగ నైపుణ్యంతో మనిషి సహేతుకమైన నిర్ణయాలు తీసుకోగల్గుతాడు.  ఇతరులను కూడా తన కోణంలోంచి ఆలోచింపజేసి ఒప్పించగల్గుతాడు.  ఈ పరిస్థితికి రావాలంటే మనిషి ముందు అవతలివారి దృక్పధం నుంచి ఆలోచనలను అంచనా వేయగలగాలి.   ఆ విధంగా స్వీయ నిర్వహణ అనేది కుటుంబం నుంచి, సహచరులనుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకొని నిలబడే శక్తినిస్తుంది.  యువతకు "ఆలోచనా సామర్థ్యం" మరియు "సామాజిక స్పృహ" అనే రెండు  అంశాలు ఏకాభిప్రాయసాధనకు, ఒత్తిడిని తట్టుకొనేందుకు, ఆందోళనలనుంచి బయట పడేందుకు అవసరం.


ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ క్రింద పేర్కొనబడిన పది అంశాలు అత్యంత ప్రాధాన్యమైన జీవిత నైపుణ్యాలు.


1. పరిశీలనాత్మక స్వీయ అవగాహన (Self awareness).

2. సహానుభూతి (#Empathy).

3. సృజనాత్మక ఆలోచన (#CreativeThinking).

4. శాస్త్రీయమైన ఆలోచన (#CriticalThinking).

5. నిర్ణయం తీసుకొనుట (#DecisionMaking)

6. సందేహ నివృత్తి (#ProblemSolving).

7. సమర్థవంతమైన సంభాషణ (#Effectivecommunication).

8. పరస్పర వ్యక్తుల సంబంధం (#InterpersonalRelationship).

9. ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి (Coping with #stress).

10. భావోద్వేగాలను ఎదుర్కొనే శక్తి (Coping with #emotions).


ప్రతీ విద్యార్ధికి ఈ పది జీవిత నైపుణ్య అంశాలపై పాఠశాల దశలోనే సరియైన అవగాహన కల్పించినట్లైన వారు వీటిపై పట్టు సాధించగలుగుతారు.  ని

ర్ణయ ప్రక్రియ అనే జీవిత నైపుణ్యం, అంతిమంగా ఒక తుది అవకాశానికి బాట వేస్తుంది.  ఈ ఫలితం ఒక పని కావచ్చు లేదా నిర్ణయాత్మక అభిప్రాయం కావచ్చు. నిర్వహణ యొక్క కార్యకలాపాలలో నిర్ణయ ప్రక్రియ అత్యంత కీలకమైనదే కాక ఏ ప్రక్రియని అమలు పరచాలన్నా దానిలో సింహ భాగం నిర్ణయానిదే.  


శాస్త్ర సాంకేతికత రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో అందుకనుగుణంగా విద్యార్థుల ఆలోచనల్లో మార్పు రావాలి. విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలంటే వారి ఆలోచన విధానమే పెట్టుబడి కావాలి. తల్లిదండ్రులు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు ఉపాధ్యాయులు కూడా వారి ఆలోచన, నడవడిపై దృష్టిపెట్టాలి.  అప్పుడే విద్యార్థులు భావి భారత పౌరులు గానూ, అంతకంటే ముఖ్యంగా భాధ్యతాయుతమైన పౌరులుగానూ తయారుకాగలరు.  


విజయానికి వనరుల కన్నా సృజనాత్మక ఆలోచన, నూతన ఆవిష్కరణలు అవసరం. తరుముకొచ్చే అవసరంలో నుంచే సృజనాత్మక ఆలోచన పుట్టుకొస్తుంది.  అప్పటివరకూ అసాధ్యమైన పనిని సులభసాధ్యం చేసే సరికొత్త ఆలోచనై మెరుస్తుంది. జనజీవనాన్ని బండ చాకిరీ నుంచి గట్టెక్కించే విశిష్ట ఆవిష్కరణై వెలుగుతుంది. 


06 Sep 2015.

No comments:

Post a Comment